Thursday, April 12, 2012

నీ చూపు కోసం ....

కఠినంగా వ్యవహరిస్తూ కరుణ చూపని కాలం కూడా
నీ కనుల ముందు కరిగి, కన్నీరై, కలువై విరిసింది.
ప్చ్ ...ఆ కాలంలో ఓ క్షణ కాలాన్నైనా కాలేకపోయాను
నీ కనుల ముందు కరిగి, విరిసే భాగ్యాన్ని పొందేలేకపోయాను.
ఆ కళ్ళకు ఏదో నిశ్చలమైన ఆకర్షణ ఉంది.
వసంతాన్ని,శిశిరాన్ని ఒకేసారి చూసినట్టైంది.
హేమంత తుషారాలు నన్ను కట్టి పడేసి,
నీ విరహ గ్రీష్మాగ్ని జ్వాలల్లో నన్ను అణువణువునా కాల్చేస్తుంటే,
నీ చిరుదరహాసం వలపుల వర్షమై నన్ను నిలువునా ముంచేసింది.
ఒక్కసారి జరిగిన మన కనుల కలయికే నాలో ఇన్ని అలజడులు రేపిందే...
ఆ అనుభవాన్ని మరల పొందాలని ఉవ్విళ్ళూరే నా వయసుకు తెలియదు పాపం....
మరో సారి చుస్తే వేవేల మరణ మృదంగాలు నాగుండె గుడిలో నీకోసం మ్రోగుతూనే ఉంటాయని.

Sunday, October 4, 2009

ఓచిన్ని ఆశ !!

ఏమిటీ ఆలోచన? ఎప్పటిదీ నిష్యబ్దం?
ఎందుకీ ఆవేదన? ఎక్కడిదీ ఆక్రోశం?

ప్రేమే వీటికి అంకురార్పణ చేసిందా?
లేక ప్రేమున్న చోటకు ఇవి చొచ్చుకు వస్తాయా?

నా నిష్యబ్దపు ఆలోచనల్ని ఆవేదనే ఆక్రోశంగా చీల్చుకు వచ్చింది.

ఈ వేదనకి మూలం ఆవేదనా?
మరి ఈ ఆవేదనకీ మూలం.......?

వెలకట్టలేని అమూల్యమైన ఆ "మూలం"
ఏమూల నుండో ఈ మూల చూస్తూ వుంటుందనే "ఆశ" ఏమూలోవుంది.

అందుకే....
కన్నీరు ప్రవాహమౌతున్నా, ఆ ఉధృతిలో మునిగిపోకుండా
"ఆశ" అనే తెరచాపను పరిచాను.
ఈ స్థితికి ఉషోదయం ఉందోలేదో ప్రస్తుతం తెలియదుకానీ,
పరిస్థితిననుసరించాననే ఆత్మసంతృప్తిని మాత్రం మిగుల్చుకున్నాను.

తరచి తరచి చూస్తే.......

కంటికి నిద్ర కరువయ్యింది,
ఆశకి శ్వాస కరువయ్యింది,
మనసుకి మమత కరువయ్యింది,
వయసుకి వలపూ కరువయ్యింది,
నోటిమాటకు పాట కరువయ్యింది,
నటనమయూరికి ఆట కరువయ్యింది,
ఉదయానికి తూరుపు కరువయ్యింది,
హృదయానికి స్పందన కరువయ్యింది,
చూపుకు గమ్యం కరువయ్యింది,
రేపుకు ఆశ కరువయ్యింది,

నాలో ఏమున్నాలేకున్నా,నువ్వూ నీనవ్వూ ఎప్పటికీ నిలిచేవుంటుంది.
తరచి తరచి నానుండి ఎన్ని వెలికి తీసావు,మరెన్ని దూరంచేసావు !
కానీ....
ఇహ నువ్వెంత తరచినా వచ్చేది మిగులున్న నీమీద నాకున్న ప్రేమే !!!

ఎవరీమె?

కన్నులు తెరిచి చూచేసరికి ఎదురుగా సాత్షాత్కరించిందీ ఓ ముగ్ధ మనోహర సౌందర్య రాశి.
నా ఈ లౌకిక చక్షువులకు ఆమెను మొత్తంగా చూసే శక్తి లేదు.

ఏర్రని సూర్యుడే ఆమెకు సింధూరమై మెరవగా,
ఇంద్రధనసులే ఆమె కనుబోమలై తీరగా,
కలువ రేఖలే వెలుగురేఖల కనులుగా,
కారుణ్యపు చీకటులే కాటుకై దిద్దగా ,
సంపంగుల సందడులే నాసికమవగా,
వెండివెన్నెలల నెలరాజే ముక్కెర కాగా,
పూరేఖలు పొదివిన మధువులే పేదవులవగా,
జల జల రాలే జలపాతాలే జూకాలవగా,
సహస్ర శంఖానాద రూపమే గ్రీవముగా,
విశృంఖ హిమపర్వతములే వక్షముగా,
గగన వీధులే మేని మధ్యమముగా,
పలువరసల పాలపుంత మారి నాభికాగా,
చతుషష్టి కళలే జంఘములవగా,
అలల అలజడులే ఊరువులవగా,
ఖగోళాల కదలికలే సిరిమువ్వలు కాగ,
త్రికాల పడగతులే పాదములవగా,
ప్రేమాక్షర నక్షత్రాలే హారమవగా,
వసంతపు మధురవాణియే వేణియ కాగా,
జనన మరణాల జాతులే జడకుప్పెలుగా,
కాలనిర్మిత భవబంధాలే గాజులుగా,
పచ్చదనపు పచ్చికపై పసిడిపూలు నేసిన చీరను కట్టగా,
రవలించే మురళి గానం రవిగాంచని రవిక కాగా,

ఆమెను చూచిన నా కర్మ చక్షువులు,నిష్కామకర్మోపాసనకై చూడగా,
ఆమె ఓ కదిలే విద్యుల్లతై అంతర్దానమయ్యింది.

Monday, August 31, 2009

ఒక రోజు

తెల్లవారుఝామున మల్లేతీగలా నిదురలేచిన నేను
"అరే! అపుడే తెల్లారిందా" అని కళ్ళుతెరిచి చూసేసరికి,
ఆ పక్కగా వున్న కిటికీలోంచి నిశీధి సూర్యుడిని చూచి ,ఒల్లువిరుచుకుని,
పల్లకీలోంచి దిగే రాకుమారిలా మంచంమీంచి దిగి,వరండాలోకి వెళ్ళేసరికి,
"ఒసేవ్,ఇంత పోద్దేక్కేదాకా ఆ మొద్దునిద్రేమిటే?"అంటూ మా బామ్మ పూజామందిరం వైపు వెళ్ళిపోయింది.
ఆ కార్యక్రమం కాస్తా కానిచ్చాక, రోజూలానే నిదురలేచిన సూర్యుడు
మబ్బులనే పరదాలమాటునుండి బయటకువచ్చి,నన్ను చూసి కన్ను గీటగా ,
ఆ నులువేచ్చని కిరణాల తాకిడికి,
హేమంతపు 'చలికాడు' "మరల సంద్యవేళ కలుస్తా" అంటూ నన్ను వీడి పోయాడు.
ఈలోగా "నీళ్లు మరిగిపోతున్నాయి.త్వరగా స్నానానికి వెళ్ళు"అంటూ అమ్మ కేకలేసింది.
పరుగు పరుగున వెళ్ళి పని పూర్తి చేసుకు వచ్చా.

పెరట్లోకి అడుగుపెట్టగానే చల్లని పిల్లగాలి నా నేస్తాల కులాసాను తెలియజేసింది.
అలా.....ముందు ముద్దమందారం దగ్గరకు వెళ్ళగానే
"అవునూ, నువ్వు ముద్దా నేను ముద్దా?"అని చిలిపి ప్రశ్న వేసింది.
దాన్ని సుతారంగా తాకుతూ "సర్లే ,ఈరోజుకు నువ్వే ముద్దు" అంటూ కొంటెగా సమాధానం చెప్పి,
మల్లే పందిరివైపు నడుస్తూవుంటే ,
నా పరికిణీ లాగి "నేస్తమా,నన్ను పలకరించవా?" అంటూ అలిగింది గులాబి.
పరికిణీని గులాబిముళ్ళనుండి సున్నితంగా తీస్తూ
"నా చెక్కిలిపై మక్కువగా తాకల్సిన నీవు,ఇలా పరికిణి లాగడం బావుందా?" అంటూ పెదవివిరిచాను.
"క్షమించవే!" అంటూ తన సుగంధాన్నినింపుకున్న ఒక మంచుబిందువును నా పెదవిపై జార్చింది.
"నువ్విచింది నీదగ్గరే ఉంచుకో" అంటూ నా మధుర ఆధారాలతో తన రేఖల్ని సుతారంగా తాకాను.
సిగ్గుతో ముడుచుకుపోయింది.
నేతిరిగి వెడుతుంటే, జాలిగా చూసిన నా చెలి రోజాను, సున్నితంగ తలలో తురుముకున్నా.
అటుగా వెళుతున్న నన్ను, మల్లే "నన్నల్లుకోవా" అంటూ పిలిచింది.
"నీతో పని సాయంత్రం కదా!" అని కన్నుగీటి వెళ్ళిపోయాను.

ఆ నిటలాక్షుని పదకమలాలను అర్చించి వెలుపలకు రాగానే, అమ్మ ఫలహారం అందించింది.
ఈలోగా, తోటలోని పరువంలో ఉన్నజామకాయలు,పక్వానికి వచ్చిన ఉసిరికాయలు,
నిన్న నానోరూరించిన వైనం గుర్తుకువచ్చింది.
వెంటనే అటుగా పోతున్న తుమ్మెదను తొడుతీసుకొని తోటదారి పట్టా!

తోటలోకి అడుగిడగానే పచ్చని పచ్చివాసనకి,
నా జిహ్వ మత్తులోకి జారి , రసస్పందనతో లావణ్య జలాలను వెలువరించింది.

నిండుమబ్బులో ఎన్ని చినుకులు ఉంటాయో ఎలా లేక్కించలేమో,
ఆకాశంలో వ్రేల్లాడే నక్షత్రాల్లా ఉన్న ఆ ఉసిరికాయలను లెక్కించడం నా తరమా! అనిపించింది.

ఆ పక్కనే ఉన్న జామకాయలు "నన్నందుకోగలవా?" అంటూ విర్రవీగాయి.
ఆ సరికే సమరానికి కాలుదువ్వుతున్న నేను,
"సరే,చూస్తావా" అంటూ చక చకా చెట్టెక్కి చిటారుకోమ్మను అందుకోప్రయత్నం చేసాను.
ఆ ప్రయత్నంలో అప్రయత్నంగా కాలుజారిన నా తత్తరపాటును చూసి విరగబడినవ్వింది ఆ జామకాయ.
"ఇక నువ్వో నేనో తేలాలి" అంటూ మరోసారి ప్రయత్నించాను.
అందీఅందనట్టున్న పరిస్తితి. నా చేతికి చిక్కకూడదనే దాని విఫలయత్నం.
చివరికి గేలుపునాదే!
ఒక్క ఉదుటన కిందికి దూకి,పరికిణీతో దాన్ని తుడిచి, కసిగా కొరికాను.
నా పళ్ళగాటుకి బిత్తరపోయింది. ఓటమినోప్పుకుంది.

ఇక, నాజిహ్వనాకర్షించే ఉసిరి మీద పడింది నా కన్ను.
ఆశలనే గులకరాళ్ళతో అమాయకత్వపు ఉసిసికాయల్ని కొట్టాను.
వెంటనే, అదృష్టమనే ఉసిరి వర్షాన్ని నేలను తాకకుండా పరికిణీలో పట్టాను.
మరి, ఆ అదృష్టాన్ని చిదిమి, అత్యాసనే గింజను తీసి పారేసి,
జీవితమనే అమాయకపు ఉసిరిని ఆస్వాదించాను.
{ఇంకా ఉంది}